హ్యాపీ నౌ హియర్
ఒక వేళ మారిపోవాలనుకుంటే ఈరోజే మారిపో. రేపు పేరు చెప్పి, నాటకాలు ఆడొద్దు. ఆనందం ఎప్పుడూ భవిష్యత్‌లో ఉండదు. వర్తమానంలోనే ఉంటుందని అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ‘పూరి మ్యూజింగ్స్’లో తాజాగా ‘హ్యాపీ నౌ హియర్’ గురించి మాట్లాడారు. భవిష్యత్‌లో సంతోషంగా ఉంటామని వర్తమానంలో ఉన్న ఆనందాన్ని వదిలేస్తున్నామని, ఇప్పుడు, ఈ క్షణమే కాదు.. ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా ఆస్వాదించాలని చెప్పారు.
మనందరి కోరిక ఒకటే. సంతోషంగా ఉండటం. అలా ఉండాలంటే దాని ముందు చిన్న కష్టం కూడా ఉండాలి. ఎందుకంటే కష్టం తర్వాత సంతోషం వస్తుందని మనందరికీ తెలుసు. అందుకే ఆ కష్టం కూడా మనమే క్రియేట్ చేసుకుని, చింతిస్తూ ఉండటం అలవాటు చేసుకున్నాం. ‘హమ్మయ్య రేపు మన కష్టాలు తీరిపోతాయి’ అనుకుంటాం. అంటే, రేపటిలో మన ఆనందాలని వెతుక్కుంటాం. మన ఆనందాన్ని రేపటికి వాయిదా వేసేసినట్లే. ‘వచ్చే సంవత్సరం కుమ్మేద్దాం’ అనుకుంటాం. మరి ఇప్పుడు ఈ క్షణం ఏమైంది? ‘నీకు దమ్ముంటే, ఈ రోజు కుమ్మేయ్.. వచ్చే సంవత్సరం ఎందుకు ? అని పూరి ప్రశ్నించారు.