ఫ్యాన్స్ అత్యుత్సాహం…! హెచ్చ‌రించిన ప‌వ‌న్…!!

మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘాల నేత‌లు ప‌లువురు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో జ‌న‌సేన‌లో చేరారు. హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలిలో ఏర్పాటు చేసిన జ‌న‌సేన చేరిక‌ల కార్య‌క్ర‌మానికి అభిమానులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. అఖిల‌భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు స్వామి నాయుడు, ఏపీ చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు క‌ట‌కం రామ‌కృష్ణ‌, తెలంగాణ అధ్య‌క్షుడు నంద‌కిశోర్, క‌ర్ణాట‌క చిరు యువ‌త అధ్య‌క్షుడు జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. వీరంద‌రినీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప‌వ‌న్.

జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలను అభిమానులు పాటించాలని, చిరంజీవి అభిమానులు జనసేన పార్టీలోకి రావటం శుభపరిణామని జ‌న‌సేన పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రజారాజ్యం సమయంలో చిరు పవన్ అభిమానులు చాలా శ్రమించారని, దురదృష్ణవశాత్తు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయామ‌న్నారు. జనసేనతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంద‌ని, అభిమానులు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

చేరిక‌ల స‌మ‌యంలో ఒక్క‌సారిగా ప‌వ‌న్ అభిమానులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించడంతో కార్య‌క్ర‌మం కాస్త ర‌సాభాస‌గా మారింది. వేదికమీద‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఒక్క‌సారిగా రావ‌డంతో బౌన్స‌ర్ల‌కు, అభిమానుల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది. పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌యత్నం చేశారు. వెంట‌నే ప‌వ‌న్ మైక్ తీసుకుని ఏపీ-తెలంగాణ, తమిళనాడు కర్ణాటక నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరకీ జనసేన పార్టీ తరుపున స్వాగతం అంటూ మొద‌లుపెట్టి, ఫ్యాన్స్ అత్యుత్సాహంతో క్రమశిక్షణ లోపిస్తోందని, అభిమానులు దయచేసి సహకరించాలని కోరారు.అయినా ఒక అభిమాని వేదికమీద‌కు దూసుకు వెళ్ల‌డంతో ఆగు అంటూ తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రించారు ప‌వ‌న్. కొంచెం త‌గ్గాలంటూ అభిమానికి సూచించారు.