రేవంత్ రెడ్డి స్థానంలో జానారెడ్డి ? టీ-పీసీసీ చీఫ్ ను మార్చే ఆలోచనలో ఏఐసీసీ !?
తెలంగాణ కాంగ్రెస్ లో జూనియర్ – సీనియర్ పంచాతీకి పులిస్టాప్ పెట్టాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. సీనియర్ల డిమాండ్ మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణికం ఠాగూర్ ను రివీల్ చేసింది. ఆయనకు గోవా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించింది. ఇక ఆయన స్థానంలో గోవా ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రేను నియమించింది. ఈ మేరకు బుధవారం ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో బుధవారం జరిగిన టీపీసీసీ శిక్షణా శిబిరంలో అందరూ సీనియర్ నేత జానారెడ్డి జపం చేయడం ఆకట్టుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంతటి త్యాగానికైనా సిద్ధం. అవసరమైతే పదవి వదులుకోవడానికి సిద్ధం అంటూనే.. ఇకపై పెద్దలు జానా రెడ్డి చెప్పినట్టుగా నడుచుకుందాం. ముందుకు పోదాం. పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని ప్రకటించారు. ఏఐసీసీ సభ్యులు సంపత్ కుమార్ అయితే జానారెడ్డి కాళ్లు పట్టుకున్నంత పని చేశారు. అవసరమైతే తిట్టండి.. కొట్టండి. కానీ పరిస్థితులు చక్కదిద్దండని విజ్ఞప్తి చేశారు. మిగిలిన నేతలు కూడా జానారెడ్డి నే పెద్ద దిక్కు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ ను కాపాడే శక్తి-సామర్థ్యాలు.. మంత్ర-తంత్రాలు ఆయన దగ్గర మాత్రమే ఉన్నాయని ఉటంకించారు.
ఇటీవలి కాలంలో టి-కాంగ్రెస్లో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. మాణిక్కం టార్గెట్గా సీనియర్లు తీవ్ర విమర్శనస్త్రాలు సంధించారు. ఠాగూర్ పీసీసీకి అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారనేది సీనియర్ల ఆరోపణ. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. సేవ్ కాంగ్రెస్ అంటూ సీనియర్ జీ-9 గ్రూపు కట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయి దాటిపోయే క్రమంలో ఏఐసీసీ జోక్యం చేసుకుంది. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణకు పంపింది. రెండ్రోజుల పాటు తెలంగాణ కాంగ్రెస్ జూనియర్లు, సీనియర్లతో మాట్లాడిన డిగ్గీరాజా.. అధిష్టానానికి ఐదు పాయింట్లతో కూడిన నివేదిక అందించారు. అందులో మాణికం ఠాగూర్ ను బాధ్యతల నుంచి తొలగించాలని సూచించినట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగానే ఠాగూర్ ప్లేస్ ఠాక్రే వచ్చారని చెబుతున్నారు.
ఇక మాణికం ఠాగూర్ విషయంలో పంతం నెగ్గించుకున్న టీ-కాంగ్రెస్ సీనియర్ల నెక్ట్స్ టార్గెట్ రేవంత్ రెడ్డి నే అంటున్నారు. ఈ మేరకు హస్తం హైకమాండ్ దగ్గర ఫైల్ ఉంచారు. ఇక తప్పని పరిస్థితుల్లో రేవంత్ స్థానంలో అందరి మెప్పు పొందిన జానారెడ్డి కి టీ పీసీసీ బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తునట్టు సమాచారం. అయితే అది ఇప్పటికిప్పుడే కాదంటున్నారు. ఠాగూర్ స్థానంలో వచ్చిన ఠాక్రే వల్ల మార్పులు వస్తే ఓకే. లేదంటే తదుపరి రేవంత్ స్థానంలోకి జానా రావడం గ్యారంటీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే.. మరి !!