బీఆర్ఎస్ లోకి RRR ?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు. శాశ్వత శత్రువులు ఉండరు. ఈ విషయం చాలా నిరూపితమైంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా.. నిన్న సుదీర్ఘ ప్రసంగం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో కూడా ఇదే కనబడింది. సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పదే పదే బీజేపీ ఎమ్మెల్యే రాజేందర్ పేరును ప్రస్తావించారు. ఆయన మాటలకు విలువ ఇస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. ఈటల చెప్పిన విషయాలను నోట్ చేసుకోవాలని మంత్రి హరీష్ రావుకు సూచించారు. ఇతర మంత్రులు కూడా ఈటలతో మాట్లాడి.. ఆయన సూచనలు, సలహాలు పాటించాలని ఆదేశించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈటలకు అగ్ర తాంబులం ఇచ్చారు. ఈటల పార్టీ మారినప్పటికీ ఇంకా మావోడే అన్నట్లు సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ ఎస్ నేతలు వ్యవహరించారు.
అంతకు ముందు రోజుల్లో బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన మంత్రి కేటీఆర్ రాజేంద్రన్న అంటూ పాజిటివ్ గా ఫిక్స్ చేశారు. మంత్రి హరీష్ రావు మాటల్లో కూడా ఈటల మీద ప్రేమ కనబడింది. రాజకీయంగా విబేధాలు ఉండొచ్చు. కానీ తాను అంటే ఈటలకు చాలా అభిమానం. పర్సనల్ చాలా బాగుంటామని చెప్పుకొచ్చారు. కేటీఆర్, హరీష్ సెట్ చేసిన ఫ్లాట్ ఫామ్ ను సీఎం కేసీఆర్ ఆదివారం పీక్స్ కి తీసుకెళ్లారు. ఎంతవరకు అంటే.. ఈటల తిరిగి బీఆర్ ఎస్ లో చేరబోతున్నట్లు ప్రచారం వైరల్ అయ్యేంత.
ఈటల ఒక్కరే కాదు.. ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి ఉన్న మరో ఇద్దరు నేతలు రఘునందన్ రావు, రాజా సింగ్ లు కూడా కారెక్కిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. వాస్తవానికి కమలం పార్టీలో ఈటల అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. కానీ ఆయన కొట్లాట సీఎం కేసీఆర్ మీద.. బీఆర్ ఎస్ పైనే. అందుకు బలమైన ఫ్లాట్ ఫామ్ బీజేపీ అని ఆయన ఆ పార్టీలో చేరారు. ఇక ఈటల చేరికకు ముందు ఆ తర్వాత నుంచి కూడా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గులాబీ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారనే ప్రచారం ఉంది. పైగా సీఎం కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన రఘునందన్ రావు ఎప్పుడు వచ్చిన వెల్ కమ్ అన్నట్లు బీఆర్ ఎస్ వర్గాలు ఉన్నాయన్నది నిజం.
ఇక రాజాసింగ్ ను పార్టీని, సిద్ధాంతాలను నమ్ముకున్నారు. కానీ బీజేపీ పార్టీ ఆయన్ని ఎప్పుడో వదిలేసింది. వివాదాస్పద వ్యాఖ్య్లుచేస్తున్నారని షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. ఆయన అరెస్టై జైల్లో ఉంటే.. కనీసం బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్ కూడా కారెక్కిన షాక్ కావాల్సిన అవసరం లేదంటున్నారు. ఎంఐఎం బీఆర్ ఎస్ కు దూరమైతే.. గులాబీ గొడుగు కిందికి పోవడానికి రాజాసింగ్ కు పెద్దగా అభ్యంతరం లేకపోవచ్చు అంటున్నారు. మొత్తానికి.. RRR ను ఆకర్షించేందుకు బీఆర్ ఎస్ పాజిటివ్ వాతావరణం అయితే సెట్ చేసింది. మరీ.. ఏం జరుగుతుందో వేచి చూడాలి !