కత్తి మహేష్’కు ఏపీలోనూ స్థానం లేదట
వివాదాస్పద సినీ, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. రాముడు, రామాయణంపై మహేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని 6నెలల పాటు హైదరాబాద్, పూర్తిగా తెలంగాణ నుంచి బహిష్కరిస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకొంది. తీసుకెళ్లి ఏపీలోని చిత్తూరు జిల్లా పీలేరులో వదిలిపెట్టేసి వచ్చారు. ఐతే, ఇప్పుడు ఏపీలోనూ కత్తి మహేష్ కు స్థానం లేదని అంటున్నారు అక్కడి బ్రాహ్మణ సంఘాలు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడ కత్తి మహేష్ పై బహిష్కరణ విదించనుందా.. ? అనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు, కత్తి మహేష్ వ్యవహారంపై ఆయన తండ్రి కత్తి ఓబులేసు మొదటిసారి స్పందించారు. తనయుడుని వెనకేసుకొచ్ఛే ప్రయత్నం చేశారు. బహిష్కరించాల్సింది మహేష్ ని కాదు.. పరిపూర్ణానందను దేశం నుంచి తరిమికొట్టాలని డిమాండ్ చేశారు. దళితుడు కాబట్టే తన కుమారుడి వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాముడు, రామాయణంపై తన కుమారుడు మాట్లాడిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమని వాదించడం విశేషం.