తారకరత్న కన్నుమూత

నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. జనవరి 27న ‘యువగళం’  పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయన 23 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. తారకరత్న పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌ తరలిస్తున్నారు.

1983 ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో తారకరత్న జన్మించారు. అలేఖ్య రెడ్డిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే నటనపై ఉన్న ఆసక్తితో.. 2002లో విడుదలైన ‘ఒకటో నెంబర్‌ కుర్రాడు’తో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘యువరత్న’, ‘భద్రాద్రి రాముడు’, ‘అమరావతి’, ‘నందీశ్వరుడు’ వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘ఇటీవల ‘9 అవర్స్‌’ వెబ్‌ సిరీస్‌లో ఆయన నటించి.. ప్రేక్షకుల్ని అలరించారు.