పవన్’కు గంటా దూరమైనట్టే !

మంత్రి గంటా శ్రీనివాసరావు మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు. ఆయన మెగాస్టార్ చిరంజీవి అనుచరుడని చెబుతుంటారు. చిరంజీవితో పాటు కాంగ్రెస్ లోకి వెళ్ళి అక్కడ మంత్రి అయ్యి ఆ తరువాత టీడీపీలో చేరారు. అలాంటి గంటా త్వరలో పవన్ కళ్యాణం నేతృత్వంలోని జనసేనలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇటీవలే మంత్రి గంటా సొంత పార్టీ నేతల తీరుపై మనస్థాపం చెంది.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన పార్టీ మారడం ఖాయమనే కామెంట్స్ వినిపించాయి. ఐతే, స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి గంటాని చల్లబర్చారు.

ఇప్పుడు కాకపోయిన మరికొన్ని రోజుల తర్వాత అయిన గంటా జనసేనలో చేరడం ఖాయమని రాజకీయవర్గాల్లో చర్చించుకొంటున్నారు. ఇలాంటి సమయంలో పవన్-గంటా ఒకరిపై మరొకరు ఘూటైన వ్యాఖ్యలు చేసుకోవడం ఆసక్తిగా మారింది. విశాఖలో పర్యటిస్తున్న పవన్ గంటాని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ భూకుంభకోణంలో గంటాకు సంబంధం ఉన్నట్టు మాట్లాడారు. ఇదీగాక, పోయిన ఎలక్షన్స్ లో గంటా, అవంతి శ్రీనివాస్ ల తరుపున ప్రచారం చేసి తప్పు చేశానన్నారు పవన్.

తాజాగా, గంటా కూడా పవన్ ని గట్టిగానే ప్రశ్నించారు. పవన్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు గంటా. ప్రత్యేక హోదాపై దేశం మొత్తం తిరిగి మద్దతు కూడగడతానన్న పవన్ పత్తా లేకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం సాయం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక ఇస్తే.. దానిమీద పన్‌ నోరు మెదపడం లేదు. కేంద్రంపై పల్లెత్తు మాట అనే ధైర్యం పవన్‌కు లేదని విమర్శించారు. మీ రాజకీయ పార్టీ రహస్య ఏజెండా ఏమిటి ? మీ పొత్తు ఎవరితో .. ? పవన్ ని సూటిగా ప్రశ్నించారు గంటా.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి మీరు సాయం చేశారు. దాన్ని మేం అంగీకరిస్తున్నాం. కానీ మీరు లేనప్పుడు కూడా టీడీపీ గెలిచిందని గంటా. పరిస్థితిని చూస్తుంటే మంత్రి గంటా శ్రీనివాస్ పవన్ కి దూరమైనట్టే కనబడుతోంది. ఇక, గంటా జనసేనలో చేరబోతున్నట్టు వార్తలు.. ఒట్టి ప్రచారంగానే మిగిలిపోనున్నాయి.