కవిత అరెస్ట్ ఖాయం ! టీ-బీజేపీ నేతలతో అమిత్ షా మీటింగు ?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయమని తేలిపోయిది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఏ-1 ముద్దాయిగా సిసోడియా ఉన్నారు. హస్తిన లిక్కర్ పాలసీ మార్పునకు ఈయనే ప్రధాన సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. సౌత్ గ్రూప్ కంపెనీ నుంచి మనీష్‌కే ముడుపులు ముట్టజెప్పినట్లు అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..ఇటు సీబీఐ తన అభియోగ పత్రాల్లో పేర్కొంది. ఇక అదే టైంలో ఈ కేసులో తన అనుయాయులు,దగ్గరి వ్యక్తుల ద్వారా కవితనే సిసోడియాకు ముడుపులు అందేలా చూశారని ఆరోపణలున్నాయి.
అటు ఈడీ కూడా కొద్ది రోజుల క్రితం తన ఛార్జిషీట్‌లో కవిత పేరునే ప్రధానంగా ప్రస్తావించింది. సీబీఐ కూడా కవితను విచారించినప్పుడు కీలక ఆధారాలను కేసు విషయంలో క్రోడికరించినట్లు సమాచారం. కవితను అరెస్టు చేసి విచారణ చేసేందుకు దర్యాప్తులు అధికారులు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈరోజు పలువురు టీబీజేపీ నేతలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. టీబీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు మరికొంత మంది పార్టీ కీలక నేతలతో షా చర్చలు జరపనున్నారు. సిసోడియా అరెస్టు తర్వాత తెలంగాణలో కేసీఆర్ కూతురును లిక్కర్ కేసులో అరెస్ట్ చేయించడం ద్వారా ఎలాంటి పరిణామాలు సంభవించవచ్చు అనే అంశాలపై వారితో చర్చించనున్నట్లు సమాచారం.