స్వామిని కూడా బహిష్కరించారు
శ్రీరాముడిపై కత్తి మహేష్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు సీరియస్ గా తీసుకోవడంతో కత్తిపై పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. స్వామి పరిపూర్ణానంద విషయంలోనూ తెలంగాణ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆరు నెలల పాటు బహిష్కరణ వేటు వేశారు. స్వామిజీని కాకినాడకు తరలించారు. గతంలో మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ లో జరిగిన హిందూ సేన ఆవిర్భావ సభలో, కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి గ్రామంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, కరీంనగర్ బహిరంగ సభలో వ్యాఖ్యలపై స్వామీజీపై చర్యలు తీసుకున్నారు పోలీసులు.
కత్తి మహేష్ వ్యాఖ్యలకు నిరసన శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు సిద్ధమయ్యారు. స్వామి యాత్రను పోలీసులు అడ్డుకొన్నారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. గత మూడు రోజులుగా స్వామిని నిర్బంధంలోనే ఉంచారు. తాజాగా, హౌస్ అరెస్ట్ లో ఉన్న స్వామిని నగర బహిష్కరణ చేస్తున్నట్టు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ లో స్వామి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ని హైదరాబాద్ నుంచి కాకినాడకు తరలించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బహిష్కరణకు గురైన తొలి వ్యక్తి కత్తి మహేశ్, రెండో వ్యక్తి స్వామి పరిపూర్ణానంద. తెలంగాణలో శాంతి భద్రతల కు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని తెలంగాణ పోలీసుల హెచ్చరించారు. గ్రూప్ తగాదాలు, మతపరమైన భావాల్ని ఇబ్బంది పెట్టే వారిని క్షమించేది లేదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.