రాహుల్‌కు బెయిల్‌

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి బెయిల్‌ మంజూరు అయ్యింది. మోడీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్‌ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల సూరత్‌ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ప్రజాప్రాతినిధ్యం చట్టం కింద రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. దీనిపై రాజకీయ దుమారం లేచిన సంగతి తెలిసిందే. 


అయితే రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై రాహుల్  గుజరాత్‌లోని సూరత్‌ డిస్ట్రిక్‌ అండ్ సెషన్స్ కోర్టులో అప్పీల్‌ చేసుకున్నారు. తన జైలుశిక్ష తీర్పును సవాలు చేశారు. ఈ తీర్పుపై అప్పీల్ చేసిన ఆయన మరో రెండు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ కేసులో తనను దోషిగా తేల్చడంపై స్టే విధించాలని, జైలుశిక్షను సస్పెండ్‌ చేయాలని అందులో కోరారు. అయితే కింది కోర్టు తనకు విధించిన జైలు శిక్ష తీర్పుపై మధ్యంతర స్టే విధించాలని రాహుల్‌ చేసిన అభ్యర్థనపై ఇప్పుడే తీర్పు చెప్పలేమని సూరత్ సెషన్ కోర్టు వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్‌ 13కు వాయిదా వేసింది.