పొంగులేటికి పదికి పది వేస్తారా ?

ఇద్దరు సీనియర్ నేతలు.. రెండు వేర్వేరు జిల్లాలు.. వారి కోసం రెండు జాతీయ పార్టీల గట్టి ప్రయత్నాలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. వారిలో ఒకరు ఖమ్మం జిల్లా సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాగా.. మరో నేత మహబూబ్ నగర్ కు చెందిన సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు. ఈ ఇద్దరి కోసం ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అధిష్టానాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇటీవలే పొంగులేటి, జూపల్లి.. ఇద్దరినీ బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందు నుంచి పొంగులేటి పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. ఫైనల్ గా బీజేపీ లో చేరాలని నిర్ణయం తీసుకున్నాడు అనే వార్తలు వినిపించాయి. ఖమ్మం జిల్లాలోని పది స్థానాలకు గానూ పది స్థానాలు పొంగులేటి అడిగారు. అందుకు బీజేపీ అధిష్టానం కూడా ఓకే చెప్పిందనే వార్తలు వినిపించాయి. అయితే ఈలోగా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది.

పొంగులేటి కోసం రాహుల్ గాంధీ టీమ్ రంగంలోకి దిగింది. స్వయంగా పొంగులేటి ఇంటికి వచ్చి చర్చలు జరిపారు. హస్తం పార్టీ ముందు కూడా పొంగులేటి పదికి పది డిమాండ్ పెట్టారు. అయితే పదికి తొమ్మిది అయితే ఓకే. మధిర భట్టి రిజర్వ్డ్ సీటు అని చెప్పినట్లు తెలుస్తోంది. ఐతే పొంగులేటి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నెలలో ఆయన ఓ డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు జూపల్లి తనతో పాటు మహబూబ్ నగర్ లో తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవాలనే ప్రయత్నాలు ఉన్నారు. ఏ పార్టీ ఎక్కువ సీట్లు ఇస్తే ఆ పార్టీ లో చేరాలని అనుకుంటున్నారు. జూపల్లి కోసం కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ ఇద్దరు కారణంగా కనీసం పదికి పైగా స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని అధిష్టానాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఈ ఇద్దరికీ భారీ డిమాండ్ నెలకొంది.