ఏ ఒక్కరో పోరాడితే తెలంగాణ రాలేదు
‘తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి వంటిది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్నగర్లో కాంగ్రెస్ నిర్వహించిన ‘ యువ సంఘర్షణ సభ’కు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ‘ జైబోలో తెలంగాణ’ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మిత్రులారా అంటూ తెలుగులో మాట్లాడారు. శ్రీకాంతా చారి గురించి ప్రస్తావించారు.
‘‘తెలంగాణ మీకు తల్లి వంటిది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఏ ఒక్కరో పోరాడితే తెలంగాణ రాలేదు. తెలంగాణ కోసం ఎందరో ఆత్మ బలిదానాలు చేశారు. మా కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేసింది. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. బలిదానాలు వృథా కాకూడదని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి” అని ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదు. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు. ప్రజల ఆకాంక్షల మేరకే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు అని అమె అన్నారు. కానీ వచ్చిన రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే పరిమితం అయ్యాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేర లేదు. ఆత్మబలిదానాలు వృధా కావద్దని సోనియా తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ కోసం అన్ని వర్గాలవారు పోరాడారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని భావించాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తమ జాగీరులా భావిస్తున్నారు’’ అని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు.