ఫైనల్’కు ఫ్రాన్స్

ఫిఫా ఫైనల్ కు ఫ్రాన్స్ చేరింది. సెమీస్ లో ఫ్రాన్స్ బెల్జియం ని 1-0తో ఓడించింది. దీంతో.. సంచలన విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చిన బెల్జియం ఆశలకు గండి పడింది. రెండు జట్లు హోరా హోరీగా పోరాడటంతో సెమీస్‌లో తొలి అర్ధభాగం వరకు ఒక్క గోల్‌ సైతం నమోదు కాలేదు. ఇరు జట్లు చక్కని డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు.

రెండో భాగంలో ఫ్రాన్స్ మరింత పట్టుదలతో ఆడింది. 51వ నిమిషంలో శామ్యూల్‌ ఉమ్‌టిటి అద్భుతమైన హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి ఫ్రాన్స్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత గోల్‌ కోసం బెల్జియం ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఇక, ఇంగ్లాండ్‌, క్రొయేషియా తలపడే సెమీస్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం మాస్కోలోని లుహినికి స్టేడియంలో ఫ్రాన్స్‌ ఫైనల్‌ ఆడనుంది.

ఈ విజయాన్ని థాయ్‌లాండ్‌లో గుహ నిర్బంధంలో చిక్కుకుని 18 రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపి సురక్షితంగా బయటపడిన 12 మంది ఫుట్‌బాల్‌ జట్టు బాలలకు అంకితమిస్తున్నట్లు ఫ్రాన్స్‌ ఆటగాడు పాల్‌ పోగ్బా ప్రకటించాడు. గుహ నిర్బంధంలో చిక్కుకున్న 12 మంది ఫుట్‌బాల్‌ జట్టు ఆటగాళ్లు ఆదివారం (జులై 15న) జరిగే ఫైనల్‌ చూసేందుకు రావాలంటూ ముందుగా ఫిఫా నిర్వాహకులు ఆహ్వానం పంపారు.

ఐతే, బాలల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, వైద్యుల సలహా మేరకు వారిని ఫైనల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు రావొద్దని సమాచారం అందించినట్లు ఫిఫా ప్రతినిధి ఒకరు తెలిపారు.