వారసత్వ రాజకీయాలు.. బీజేపీ చేతికి చక్కటి అస్త్రం !
తెలంగాణ రాజకీయాల్లో డబుల్ టికెట్ల లొల్లి కొనసాగుతుంది. తమతో పాటు తమ వారసుడికి టికెట్ ఇవ్వాల్సిందేనని సీనియర్ నేతలు పట్టుబడుతున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ గురించి స్పష్టంగా తెలిసిన నేతలు కూడా.. మాకు మినహాయింపు ఇవ్వాల్సిందేనని హైకమాండ్ కు రిక్వెస్టులు పంపుతున్నారు.
తనకు, తన భార్య పద్మావతికి టిక్కెట్లు ఇవ్వాలని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టికెట్లు కేటాయించాలని అడుగుతున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ తమకు వర్తించదని అంటున్నారు. తన భార్య పద్మావతి గత ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆమె 5 ఏళ్లకు పైగా రాజకీయాల్లోకి ఉన్నారని చెబుతున్నారు. మరో సీనియర్ నేత జానారెడ్డి టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు కానీ ఆయన ఇద్దరు కుమారులిద్దరికీ మిర్యాలగూడ, నాగార్జున సాగర్ టిక్కెట్ కావాలని అడుగుతున్నారు. దామోదర రాజనర్సింహ , సీతక్క , కొండా సురేఖ , , అంజన్ కుమార్ యాదవ్ వంటి వారు కూడా తమ వారసుల్ని రంగంలోకి దించుతున్నారు. సీనియర్ నేతలు మాత్రమే ఒక్కసారి కూడా పోటీ చేయని వారు కూడా డబుల్ టికెట్లను డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీలో మాత్రమే అధికార బీఆర్ ఎస్ పార్టీలోనూ రెండు టికెట్ల లొల్లి ఉంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనకు తన కొడుక్కి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కేవలం తనకు మాత్రమే మల్కాజిగిరి టికెట్ కేటాయించిన బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. గులాబీ పార్టీలో మరికొందరు డబుల్ టికెట్ల ఆశావాహులు ఉన్నా.. ఇప్పటికే టికెట్లు ప్రకటించిన నేపథ్యంలో.. సాధ్యం కాదని సైలైంట్ అయినట్లు కనబడుతుంది.
బీజేపీకి చేతికి వారసత్వ అస్త్రం :
ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల మీద వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీలు అనే ముద్ర ఉంది. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం పెద్ద మైనస్ గా మారింది. యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని రాహుల్ గాంధీ, కేసీఆర్, కేటీఆర్ పదే పదే పిలుపునిస్తుంటారు. కానీ టికెట్ల దగ్గరకు వచ్చేసరికి సిట్టింగులనే రిపీట్ చేస్తారు. దీంతో.. వారి క్రెడిబులిటీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ మధ్య మహిళా రిజర్వేషన్ల పై దేశ వ్యాప్తంగా ఉద్యమం చేస్తానని హడావుడి చేసిన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ ఎస్ పార్టీ టికెట్ల కేటాయింపు విషయంలో మాత్రం మహిళలకు న్యాయం చేయలేకపోయింది అనే అపవాదు కూడగట్టుంది. అయితే టికెట్ల కేటాయింపు విషయంలో.. కాంగ్రెస్, బీఆర్ ఎస్ ల వారసత్వ రాజకీయాల అస్త్రాన్ని ఎందుకనో టీ బీజేపీ అందుకోలేకపోతుందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.