బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఈటల, వివేక్ డుమ్మా.. ! అసలేం జరుగుతోంది ?
తెలంగాణ బీజేపీ కీలక నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందన్ రావు తదితరుల పేరు వినబడుతున్నాయి. తాను పార్టీ మారడం లేదని రఘునందన్ పదే పదే స్పష్టత ఇచ్చినా.. ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం మరిన్ని డౌటు అనుమానాలకు తావునిస్తోంది. ఈ మీటింగ్ కు ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ హాజరు కాలేదు. అయితే వీరిద్దరిలో ఈటల ముందస్తు సమాచారం ఇచ్చారని అంటున్నారు. వివేక్ వస్తారని భావించిన ఆయన రాలేదని తెలుస్తోంది.
ఇక పదాధికారుల సమావేశాల్లో ఎన్నికలే లక్ష్యంగా పలు కీలక చర్చలు, నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో తెలంగాణ బీజేపీ అనేక అంతర్గత కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పుడు వాటిని అన్నింటిని సమీకరించి… ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలలో నిర్వహించిన సమ్మేళనాలపై రివ్యూ నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. రాబోయే ఎన్నికల కోసం అనేక కమిటీలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఏయే కమిటీలో ఎవరికి చోటు కల్పించాలి అనే దానిమీద ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఎన్నికల కమిటీలు, ఛార్జ్ షీటు, మేనిఫెస్టో మీద చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. అదే తరహా తెలంగాణ బీజేపీ కూడా స్టార్ క్యాంపైనర్ ను నియమించబోతున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్దిని స్టార్ క్యాంపైనర్ గా నియమించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ పదవి కోసం వివేక్, రాజగోపాల్ రెడ్డిల మధ్య గట్టి పోటీ ఉంది. అయితే వివేక్ అసలు మీటింగ్ కే హాజరు కాలేదు. సాయంత్రంలోగా ఆయన హాజరు అవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇక సెప్టెంబర్ 17 నిర్వహించే కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని అంటున్నారు. సెప్టెంబర్ 17 ప్రధాని మోడీ పుట్టినరోజు కావడంతో.. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. మొత్తానికి.. తాజాగా జరుగుతున్న బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం చాలా కీలకమని చెప్పవచ్చు.