రాజమౌళి కొత్త సినిమా పేరు మార్చుకోవాల్సిందే ?

దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరో సినిమా పనులు షురూ చేయలేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న తదుపరి సినిమా ఉండనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం ఇంకా రాలేదు. ఈ లోపు రాజమౌళి సమర్పణలో ఓ సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. భారత చలనచిత్ర పరిశ్రమ ఎక్కడ పుట్టింది, దానికి మూలం ఏంటి అనే కథతో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ సినిమా రాబోతుంది. నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఎస్‌ఎస్‌ కార్తికేయ, వరుణ్‌ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజమౌళి సమర్పకులు.

కేంద్ర ప్రభుత్వం ఇండియాకు బదులుగా  భారత్ అనే పేరును ప్రస్తావిస్తుంది. ఈ మేరకు పేరు మారుస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇటీవల జరిగిన జీ20 సదస్సు ఆహ్వాన పత్రికలో భారత్ పేరును పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ బదులు ‘మేడ్‌ ఇన్‌ భారత్‌’గా మార్చాలంటూ కొందరు ట్వీట్‌ చేస్తున్నారు. ‘టైటిల్‌లో ఇండియాను తీసేసి భారత్‌ను చేర్చండి’ అని కామెంట్స్‌ పెడుతున్నారు. దీనిపై రాజమౌళి గానీ చిత్రబృందం గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.