45 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా !
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా మరికొద్దిసేపట్లో రాబోతుంది. ఇప్పటికే 55 మందితో కూడిన తొలి జాబితాను టీ కాంగ్రెస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంకా 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే రెండో జాబితాలో 45 మందికే టికెట్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంలో స్క్రీనింగ్ కమిటీ చేతులెత్తేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో పోటీ బీభత్సంగా ఉంది. ఒక్కో స్థానానికి నలుగురు ఐదుగురు పోటీ పడుతున్నారు. ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్న నేతలు, ఎంతో కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న నేతలు టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ తదితర నేతలు తమ తమ వర్గం నేతలకు టికెట్లు ఇప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక వ్యవహారం రాష్ట్ర అధ్యక్షుడికే అప్పగించినట్లు తెలుస్తోంది.
బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తొలి జాబితా రిలీజైన తర్వాత బీసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి తమ డిమాండ్ ను హైకమాండ్ కు వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అవి ఫలించలేదు. దీంతో.. బీసీ నేతలంతా రెండో జాబితా మీద ఆశలు పెట్టుకున్నారు. మరీ.. రెండో జాబితాలో బీసీలకు ఏ మేరకు టికెట్లు కేటాయిస్తారు ? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు పటాన్చెరుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు నీలం మధు కాంగ్రెస్లో చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నీలం మధు పటాన్చెరు నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు హస్తం పార్టీ ఓకే చెప్పినట్లు సమాచారం.