ఓటీటీలోకి ‘టైగర్ నాగేశ్వరరావు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. ఇందులో రవితేజ సరసన నుపుర్ సనన్ నటించగా రేణు దేశాయ్ కీలకపాత్రలో కనిపించారు. భారీ అంచనాల మధ్య దసరా కానుకుగా విడుదలైన ఈ సినిమా మిక్సిడ్ టాక్ ను సొంతం చేసుకుంది. థియేటర్స్ లో పెద్దగా ఆడని సినిమాలు సైతం ఓటీటీలో అదరగొడుతున్నాయి. టైగర్ నాగేశ్వర్ రావు కూడా ఈ జాబితాలో చేరుతుందేమో చూడాలి.
స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1970, 80 దశకాల్లో స్టూవర్టుపురం నాగేశ్వరరావు పేరు వింటే చాలు… అటు ప్రజల్లోనూ ఇటు పోలీసు వ్యవస్థలోనూ ఓ రకమైన అలజడి మొదలయ్యేది. దోపిడీలకి పెట్టింది పేరైన నాగేశ్వరరావు కన్నుపడిందంటే చాలు… ఎంత విలువైనదైనా, ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా చెప్పి మరీ దొంగతనం చేస్తాడని పేరు. ఇప్పటికీ ఆయన గురించి కథలు కథలుగా చెప్పుకొంటుంటారు. ఆయన కథ ఆధారంగా సినిమా తెరకెక్కడం.. ఆ కథలో రవితేజ హీరోగా నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను చిత్రం అందుకోలేకపోయింది.