గాంధీ భవన్ ముందు బీఆర్ఎస్ నేతల క్యూ !
ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఇక రాజకీయాల్లో అధికారం నేతల లక్ష్యం అంటారు. పవర్ ఎటు వైపు ఉంటే అటు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఇదే పరిస్థితి నెలకొందని సమాచారం. తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు పదేళ్ల పాలనలో కేసీఆర్, ఆయన కుటుంబం తల పొగరుతో తెలంగాణ ప్రజలు విసిగిపోయి.. ఆఖరికి కల్వకుంట్ల ఫ్యామిలీకి, దొరల పాలనకు తమ ఓటుతో చమరగీతం పాడారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గత ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడి.. రెండు గంటలు కూడా గడవకముందే కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న ఎమ్మెల్యేలు వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో సుధీర్ రెడ్డి, తెల్లం వెంకాట్రావ్ తో పాటు.. నోరు తెరిస్తే తమ దేవుడు కేసీఆర్, సర్ కేటీఆర్ అంటూ భజన చేసే మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పేర్లు ఉండడం విశేషం. వీళ్లే కాకుండా ఇంకా చాలామంది హస్తం గూటికి చేరేందుకు ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు. అవసమైతే కారు దిగి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు రాయబారాలు పంపిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం తమవంతు కృషి అంటూ జంపింగ్ ప్లాన్ అల్లుతున్న పరిస్థితి కనబడుతుంది.