ఇకపై నాలుగు నెలలకోసారి ప్రజాపాలన సదస్సులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రజాపాలన కార్యక్రమం గడువు ఈ నెల 6తో ముగియనుంది. అయితే ప్రజాపాలన గడువు పెంచే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై నాలుగు నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున.. ఇప్పుడు దరఖాస్తు చేయని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
బుధవారం కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన సదస్సులు ముగియగానే దరఖాస్తుల్లోని డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టి.. ఈనెల 17 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈనెల 6 నుంచి 17 లోపు అన్ని దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. మండల కేంద్రాల్లోనూ దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టాలన్నారు. డేటా ఎంట్రీపై రాష్ట్ర స్థాయి సిబ్బందికి ఈనెల 4న, జిల్లా స్థాయి సిబ్బందికి ఈనెల 5న శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆధార్, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల డేటా నమోదు చేయాలని ఆదేశించారు.