ఆన్ లైన్ మోసం..! కంగుతిన్న బాధితుడు..!!
ప్రస్తుతం దుస్తుల నుంచి గుండు సూది వరకు ఏది కొనాలన్నా ఆన్ లైన్ లోనే జరిగిపోతోంది. కొనుగోళ్లు, అమ్మకాలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. అంత స్థాయిలో ఆన్ లైన్ మోసాలు జరుగుతున్నాయి. మనం బుక్ చేసిన ఐటెమ్ చేతిలోకి వచ్చేదాకా, వచ్చాక అందులో ఉన్నది మనం బుక్ చేసిన ఐటేమేనా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. అందుకే ఆన్ లైన్ లోనూ బ్రాండ్ వెబ్ సైట్ ను ఫాలో అవుతున్నారు చాలామంది. అయితే నమ్మకంగా ఉన్న బ్రాండ్ వెబ్ సైట్ లు సైతం ఇప్పుడు కస్టమర్లు కంగుతినే షాక్ ఇస్తున్నాయి.
హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన రాజలింగం ఈ నెల 10న అమెజాన్ ద్వారా ఆన్ లైన్ లో ఓ ఐటేమ్ బుక్ చేశారు. హ్యాండ్ హెల్డ్ వైర్లెస్ మైక్రో ఫోన్ ను బుక్ చేశాడు. డెలివరీ వచ్చేసింది. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూసిన కస్టమర్ అందులో ఉన్న ఐటెమ్ చూసి కంగు తిన్నాడు. షాక్ కు గురయ్యాడు. తాను బుక్ చేసిన హ్యాండ్ హెల్డ్ వైర్లెస్ మైక్రో ఫోన్ కు బదులుగా ఒక నాపరాయి ఉండటం చూసి మోసపోయానని గ్రహించాడు. దీంతో అమెజాన్ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదీ సంగతి ఆన్ లైన్ కొనుగోళ్ల విషయంలో మీరూ కాస్త జాగ్రత్తగా ఉండండి మరి..