శేష్ మూడో సినిమాపై సస్పెన్స్

అడవిశేష్ తన కెరీర్‌ను చాలా పద్ధతిగా నిర్మించుకుంటున్న హీరోల్లో ముందువరుసలో ఉంటాడు. థ్రిల్లర్, యాక్షన్, ఫిక్షన్ ఇలా అన్ని రకాల కథలను ఎంచుకుంటున్నాడు. తన నుంచి సినిమా వస్తోందంటే ఒక రకమైన అటెన్షన్ మొదలవుతుంది. హడావుడి లేకుండా వచ్చి, సైలెంట్‌గా హిట్ కొట్టి వెళ్తుంటాడు. మెల్లగా తన మార్కెట్ కూడా పెంచుకుంటున్నాడు. అయితే ఈ ఏడాది తన నుంచి సినిమా ఏదీ రాలేదు. హిట్ 2 తర్వాత అతను కనిపించలేదు. తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు కూడా బయటకు రావడం లేదు. అయితే ఈ గ్యాప్‌కు తెరదించుతూ 2025లో మూడు సినిమాలను రిలీజ్ చేస్తానని ప్రకటించాడు అడవిశేష్.

ప్రస్తుతం ‘గూఢచారి 2’, ‘డెకాయిట్’ సినిమాల్లో నటిస్తున్నాడు శేష్. ఇవి రెండూ భారీ ప్రాజెక్టులే. ‘గూఢచారి’ సీక్వెల్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇవి రెండూ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. రెండూ 2025లోనే వస్తాయి. మరి ఆ మూడో సినిమా ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. శేష్ ఈ గ్యాప్‌లో గుట్టు చప్పుడు కాకుండా మరో సినిమా ఏదైనా మొదలెట్టేశాడా? లేదంటే మరో సినిమాలో గెస్ట్ రోల్ ఏమైనా ప్లే చేస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2025లో మాత్రం శేష్ వరుసగా సినిమాలను విడుదల చేయడం ఖాయం. ఈలోగా కొత్త కథలను వింటున్నాడని టాక్. ఆ మూడో సినిమా ఏమిటో శేష్‌కే తెలియాలి.