ముందస్తు ఎన్నికలపై స్పష్టతనిచ్చిన అమిత్ షా..!!
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర నేతలు, వివిధ పదాధికారులతో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2019 ఎన్నికలకు అమిత్ షా మార్గనిర్ధేశం చేశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరిపారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ అవినీతిపై పోరాటానికి సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు అమిత్ షా.
తెలంగాణ లో బలమైన రాజకీయ శక్తి బిజెపియేనంటూ కార్యకర్తలతో చెప్పారు షా. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా గ్రామ స్థాయినుండి పోరాడాలని దిశానిర్ధేశం చేశారు. ముందస్తు ఎన్నికలపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులకు ముందస్తుపై స్పష్టతనిచ్చారు. ముందస్తు ఉండదని చెప్పినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. షెడ్యూల్ పరంగానే ఎన్నికలుంటాయని ఆయన చెప్పినట్లు బీజేపీ నేతలంటున్నారు.
మరో వైపు రాష్ట్ర బీజేపీలో గ్రూప్ వార్ నడుస్తున్న నేపథ్యంలో వాటిపై కూడా దృష్టిపెట్టారు షా. కారణాలు, పరిష్కారాలపై చర్చలు జరిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్, ధర్మపురి అరవింద్ తో విడివిడిగా ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు.