తొలి విడత ఎంబీబీఎస్ సీట్ల భర్తీ.. పూర్తి !
తెలంగాణలో వైద్యకళాశాలల్లోని కన్వీనర్ కోటాలో తొలివిడత సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసింది. మొత్తం కన్వీనర్ కోటాలో 1804 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో తొలి విడతగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లోని 1758 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 16లోపు కేటాయించిన కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. క్రీడా, సైనిక, ఎన్సీసీ తదితర ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన 46 ఎంబీబీఎస్ సీట్ల ప్రక్రియను సాంకేతిక కారణాల ఇంకా భర్తీ చేయలేదు.
మరోవైపు, యాజమాన్య సీట్ల భర్తీ.. ప్రైవేటు, మైనారిటీ, సైనిక వైద్యకళాశాలల్లో యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలివిడత ప్రవేశ ప్రక్రియకు ప్రకటన విడుదలైంది. ఈనెల 17 నుంచి 19 వరకూ యాజమాన్య సీట్ల భర్తీ చేపట్టనున్నారు.
ప్రవేటు వైద్యకళాశాలల్లో యాజమాన్య కోటాలో 540, ప్రవాస భారతీయ(ఎన్ఆర్ఐ) కోటాలో 235 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మైనారిటీ కళాశాలల్లో యాజమాన్య కోటాలో 136, ఎన్ఆర్ఐ కోటాలో 84 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రైవేటు కళాశాలల్లోని దంత వైద్య (బీడీఎస్)కళాశాలల్లో యాజమాన్య కోటాలో 384, ఎన్ఆర్ఐ కోటాలో 150 సీట్లు ఉన్నాయి.