టీ-బీజేపీకి పిచ్చ క్లారిటీ వచ్చింది
తెలంగాణ బీజేపీ నేతలకు ఇన్నాళ్లకు ఓ క్లారిటీ వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు భాజాపా సంపూర్ణ మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే. ఐతే, ఆ క్రెడిట్ ని 2014 ఎన్నికల్లో వాడుకోలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ-టీడీపీ కలిసి పోటీ చేసింది. మొన్నటి వరకు దాదాపు నాలుగేళ్లు టీడీపీతో స్నేహబంధం కొనసాగించింది. టీడీపీతో పొత్తు కారణంగా సొంతంగా ఎదగలేకపోతున్నామని ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు వాదిస్తూనే ఉన్నారు. ఇప్పుడా సమస్య తీరింది. టీడీపీతో భాజాపా బంధాన్ని తెంచుకొంది. మరి.. ఇప్పుడైనా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుందా.. ? వచ్చే ఎన్నికల కోసం మరెవరితోనైనా జతకట్టనుందా.. ?? అనే సందిగ్ధత నెలకొంది.
ఈ సందిగ్దతకు తెరదించారు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. ఒక్కరోజు తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా టీ-భాజాపా నేతలకు పిచ్చ క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. తెలంగాణలో ఎవరితోనూ పొత్తు ఉండదు. ఒంటరిగానే ముందుకు వెళదాం. మొత్తం 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుదామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఇదీగాక, కొన్నాళ్లుగా ముందుస్తుపై జరుగుతున్న ప్రచారంపై షా క్లారిటీ ఇచ్చారు. లోక్ సభకు ముందస్తు రాకపోవచ్చని తెలిపారు. పొత్తుల కారణంగానే ఏపీ, తెలంగాణలో దెబ్బతిన్నామని, ఇకపై ఒంటరిగా వెళ్లి, సొంతంగా ఎదగాలని నేతలకు సూచించారు. మరీ.. సొంత కాళ్ల మీద నిలబడాలన్న టీ-బీజేపీ ప్రయత్నం ఎంత మేరకు సఫలం కానుందనేది చూడాలి. మొత్తానికి.. చాలాకాలం తర్వాత తెలంగాణ భాజాపా నేతలకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇకపై దూకుడే.. !