బీజేపీ చేస్తున్న అభివృద్ధిని త‌క్కువ చేసి చూపిస్తున్నారు…!

బీజేపీ నేత పురందేశ్వ‌రి ప్ర‌సార మాద్య‌మాల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఏపీలో ప్ర‌సార‌మాధ్య‌మాలు బీజేపీ చేస్తున్న అభివృద్ధిని త‌క్కువ చేసి చూపులున్నాయ‌ని ఆమె ఆరోపించారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌రిగిన ఓ స‌మావేశంలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ పోల‌వ‌రం, విశాఖ ప‌ర్య‌ట‌న‌లతో పాటు చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి ప‌త్రిక‌ల్లో , ఛాన‌ల్స్ లో వాస్త‌వాలు రాలేద‌ని అన్నారామె. అందుకే అమిత్ షా ఆదేశాల మేరకు ఎపిలో ప్రతి బిజెపి కార్యకర్తా ఒక్కో ప్రసార మాధ్యమంలా పనిచేస్తామ‌ని ఆమె అన్నారు.

ఏపికి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ఆమె బీజేపీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. ఎయిమ్స్ కు రూపాయి ఇవ్వలేదన్న ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ అన్నార‌ని, కానీ ఎయిమ్స్ దాదాపు నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి నుంచే ఒపి సేవలు అందించేందుకు సిద్దమైన విషయం కేంద్రమంత్రి నడ్డాగారి పర్యటన ద్వారా వెల్లడయిందని ఆమె చెప్పారు. పోలవరం ఎత్తు ఏమాత్రం పెరగక పోయినా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ భూమి ,నష్ట పరిహార నిధులు ఎందుకు కావాలంటోందో చెప్పలేకపోతోందని అన్నారామె.