తెచ్చిన వారు..! ఇచ్చిన వారు..!! మద్దతిచ్చిన వారు..!!!
వచ్చే ఎన్నికల్లో వంద సీట్లకు పైగా మావేనంటోంది అధికార టీఆర్ఎస్ పార్టీ.. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ఢంకా భజాయించి చెబుతోంది కాంగ్రెస్.. ఇక తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి విజయఢంకా మోగిస్తామని, బీజేపీదే అధికారమని చెప్పుకుంటోంది కమలం పార్టీ.. ఇలా ఎవరికి వారు అధికారం తమదంటే తమదంటూ చెప్పుకుంటున్నప్పటికీ రాజకీయంగా ఎవరికి వారు వ్యూహాత్మక అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నారు. ఎలాగైనా సరే 2019లో అధికారం దక్కించుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి పార్టీలు.
ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది. క్రమంగా బలం పుంజుకునే పనిలో పడ్డాయి పార్టీలు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాత్రమే పోటీ ఎక్కువగా ఉంటుంని భావించిన తెలంగాణ వాసులకు ఇప్పుడు కొత్త జోష్ తో బీజేపీ స్పీడ్ పెంచడంతో పొలిటికల్ గా కాస్త సీన్ మారిపోతుందా అనే అనుమానం మొదలైంది. అధికార పార్టీపై వ్యతిరేకతను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బీజేపీ స్పీడ్ పెంచడం, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంపై దృష్టిసారించడం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి.
తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ అని అధికార పార్టీ చెప్పుకుంటుండగా, ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. అధికార పార్టీ వైఫల్యాలతో పాటు , ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళుతోంది. తాజగా అమిత్ షా సూచనతో బీజేపీ కూడా ఇదే సూత్రాన్ని పాటించేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణకు బీజేపీ మద్దతివ్వకపోతే అసలు తెలంగాణ వచ్చేదా అంటూ ప్రజలను ఆలోచింపజేయాలనుకుంటోంది ఆ పార్టీ. వచ్చే ఎన్నికల్లో తెచ్చినవారు, ఇచ్చిన వారు, మద్దతు ఇచ్చిన వారు అనే సెంటిమెంట్ తోనే ముందుకెళ్లనున్నట్లు కనిపిస్తోంది.
ఎన్నికల నాటికి పార్టీల పొత్తుల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఒకే ఒక్క అంశం మీద ఆధారపడి ఉందనేది ఈ మధ్య వినిపిస్తున్న వాదన. అధికార టీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీలూ ఎలాగూ ఒంటరిపోరుకు సిద్ధపడినట్లు స్పష్టమైంది కాబట్టి, కాంగ్రెస్ తో ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో అధికారం ఎవరిదనేది తేలిపోనుంది. ఎన్నికల్లోగా బీజేపీ మరింత బలపడినా అది ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత బలంగా తయారవకపోవచ్చు.
ఓటింగ్ ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ చీల్చితే అవి కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తుందనే విశ్లేషకుల అంచనా. ఇది అధికార టీఆర్ఎస్ కు లాభం చేకూరుస్తుందనేది ఒక అంచనా. బీజేపీ ఎంత బలపడితే టీఆర్ఎస్ కు అంత మంచిదనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనూ ఉంది. ఇదిగాక ఎన్నికల్లో సీన్ వేరేలా ఉంటే మాత్రం టీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీలితే కాంగ్రెస్ కు లాభం చేకూరుతుంది. మొత్తంగా బీజేపీకి వచ్చే ఓటుబ్యాంకుపైనే వచ్చే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉన్నాయనేది నిజం. మరి ప్రజల ఓటు తెచ్చిన వారికో, ఇచ్చిన వారికో.. లేక మద్దతిచ్చిన వారికో తెలియాలంటే వేచి చూడాల్సిందే..