రాజమౌళి ముందస్తు ప్లాన్.. అదిరింది !

దేశంలో ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కూడా ముందస్తుకు వెళ్లేందుకు రెడీ అయినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రామ్ చరణ్, తారక్ లతో ఓ మల్టీస్టారర్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని నవంబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని జక్కన్న భావించారు. ఐతే, ఇప్పుడు ఓ నెల ముందుగానే అంటే అక్టోబర్ లోనే సినిమాని మొదలెట్టబోతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి కూడా ముందస్తుకు వెళ్తున్నాడని కామెంట్స్ వినబడుతున్నాయి.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో తారక్-చరణ్ (#RRR) మల్టీస్టారర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి కథపై కసరత్తు చేశాడని చెబుతున్నారు. సినిమాలో తారక్, చరణ్ లకు సమాన ప్రాధాన్యత కలిగేలా అద్భుతంగా తీర్చిదిద్దాడట. ఇదీగాక, ఈ మల్టీస్టారర్ ని బాహుబలి రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో #RRR (వర్కింగ్ స్టయిల్) విడుదల చేయబోతున్నారు. ఈ మల్టీస్టారర్ ని బాలీవుడ్ లో రిలీజ్ చేసే విషయమై రాజమౌళి ఇప్పటికే ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తో చర్చినట్టు చెబుతున్నారు.

ఈ మల్టీస్టారర్’లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో జతకట్టే హీరోయిన్స్ ఎవరనేది ఆసక్తిగా మారింది. బహుశా.. తారక్, చరణ్ ల కోసం రాజమౌళి బాలీవుడ్ హీరోయిన్స్ తీసుకురావొచ్చు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. 2020లో ఈ మల్టీస్టారర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం తారక్ త్రివిక్రమ్ ‘అరవింద సమేత’, రామ్ చరణ్ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తి కాగానే రాజమౌళి ఆర్ఆర్ఆర్ మొదలుకానుంది.