గెలుపు క్రొయేషియాదే.. బయన్ జోస్యం !

ఫిపా ప్రపంచకప్‌ చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని నిమిషాల్లో ఫ్రాన్స్‌, క్రొయేషియా మధ్య ఆఖరి పోరు ప్రారంభం కానుంది. ఫైనల్‌ పోరు కోసం యావత్‌ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గత చరిత్ర చూస్తే మాజీ ప్రపంచ ఛాంపియన్‌ ఫ్రాన్సే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. గ్రీజ్‌మన్‌, ఎంబప్పె, పోగ్బా, ఉంటిటి లాంటి ఆటగాళ్లతో అటు డిఫెన్స్‌లో, ఇటు ఎటాకింగ్‌లో ఫ్రాన్సే పటిష్ఠంగా కనిపిస్తున్నా.. క్రొయేషియాను తక్కువ అంచనా వేయలేం. ఈ టోర్నీలో అండర్‌ డాగ్‌గా అడుగుపెట్టిన క్రొయేషియా ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా ఫైనల్‌ కు దూసుకెళ్లింది. ఆఖరి పోరులోనూ అదే జోరును కొనసాగించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించేందుకు క్రొయేషియా సన్నద్ధమైంది.

మరోవైపు సైబీరియన్‌ ఎలుగు బంటి బయన్‌ కూడా క్రొయేషియానే తుది పోరులో విజేతగా నిలుస్తుందంటూ జోస్యం చెబుతోంది. గత ప్రపంచకప్‌లతో పాటు, ఈ వరల్డ్‌కప్‌లోనూ జంతువుల జోస్యాలు నిజం కావడంతో అభిమానులు కూడా బయన్‌ జోస్యం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు 2010 ప్రపంచకప్‌లో సముద్రపు జంతువు ఆక్టోపస్‌ పాల్‌ జర్మనీ ఆడిన ఏడు మ్యాచ్‌ల ఫలితాలను సరిగ్గా ఊహించిన చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఫైనల్లోనూ స్పెయిన్‌ విజయాన్ని కూడా సరిగ్గా చెప్పి యావత్‌ ఫుట్‌బాల్‌ అభిమానులు మతులు పోగొట్టింది.
ఇక, భారత్ లోని కొన్ని ప్రదేశాల్లో ఫ్రాన్స్ మద్దతుగా పూజలు చేయడం విశేషం.