సాకర్ కప్ ఫ్రాన్స్ దే !
సాకర్ కిక్ ఫ్రాన్స్’కే దక్కింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-2తో విజయం సాధించింది. బంతి ఎక్కువసేపు క్రొయేషియా చేతిలో ఉన్నా విజయం మాత్రం దక్కలేదు. క్రొయేషియా ఆటగాళ్లు అనవసరపు తప్పిదాలకు తగిన మూల్యమే చెల్లించుకున్నారు. మ్యాచ్ ఆరంభంలోనే 18వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మండ్జుకిచ్ పెద్ద పొరపాటు చేశాడు. గ్రీజ్మన్ కొట్టిన ఫ్రీకిక్‌ను అనవసరంగా తలతో అడ్డుకొని సెల్ఫ్‌గోల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా 1-0తో ఫ్రాన్స్ ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత ఎటాకింగ్ గేమ్ ఆడిన క్రొయేషియాకు 28వ నిమిషంలో పెరిసిచ్ నేరుగా గోల్ కొట్టి ఆధిక్యాన్ని 1-1తో సమం చేశాడు. 36వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు పెరిసిచ్ అనవసరంగా చేతితో బంతిని అడ్డుకోవడంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ అవకాశం దొరికింది. 38వ నిమిషంలో గ్రీజ్మన్ దానిని గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. లి అర్ధభాగం 2-1తో ఫ్రాన్స్ ఆధిక్యంలో నిలిచింది.
రెండో అర్ధభాగంలో క్రొయేషియా డిఫెన్స్‌ను దాటుకుంటూ ఫ్రాన్స్ బంతిపై ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలోనే 59వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు పోగ్బా నేరుగా గోల్ కొట్టి ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు. మరికొన్ని నిమిషాల్లోనే ఎంబాపె కూడా మరో గోల్ కొట్టాడు. 69వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు ముండ్జుకిచ్ సులభంగా గోల్ కొట్టి ఆధిక్యాన్ని 4-2కి చేశాడు. ఐతే, ఆ తర్వాత క్రొయేషియా ఎంత ప్రయత్నించిన గోల్ చేయలేకపోయింది. దీంతో సంచలానాలు నమోదు కాలేదు. ఫ్రాన్స్ ప్రపంచకప్ గెలిచేసింది. ఆటకు ముందు బయన్ జోస్యం తప్పని రుజువైంది.