ఉత్తమ్ చదువకున్న అజ్ఞాని..! జానారెడ్డి సౌండ్ లేని నేత..!!
టీఆర్ఎస్ నేతలు విమర్శల్లో పదును పెంచారు. కాంగ్రెస్ ప్రధాన నేతలే టార్గెట్ గా విమర్శలు కురిపిస్తున్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు అధికారంపై పగటికలలు కంటున్నారని, ఉత్తమ్ కుమార్ చదువుకున్న అజ్ఞాని అంటూ ఘాటు విమర్శలు చేశారు. కోమటిరెడ్డి చదువురాని అజ్ఞాని అన్నారయన. జానారెడ్డి అన్ని ఉన్నా సౌండ్ ఉండని నేత అని వ్యాక్యానించారు. వీళ్లంతా కేసీఆర్ ది కుటుంబ పాలన అనడంలో అర్ధం లేదని అన్నారు గుత్తా.
జాతీయ కాంగ్రెస్ పార్టీని ఫ్యామిలీ పార్టీగా మార్చారని, కోమటిరెడ్డి ఇంట్లో రెండు…. ఉత్తమ్ ఇంట్లో రెండు పదవులు ఉన్నాయని వీళ్లను ఏమనాలని ఆయన ప్రశ్నించారు. జానారెడ్డి, దామోదర్ రెడ్డిలు తమ పుత్రరత్నాల కోసం పడరాని పాట్లు లేవని దుయ్యబట్టారు. ఇలాంటి వాళ్లు కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడంలో అర్ధం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఓర్చుకోలేక కండ్లున్న కబోదుల్లా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు అర్ధరహితమని అన్నారాయన.
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దళితులకు మూడెకరాల భూమి లాంటి పథకాలపై ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ నేతలంతా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలంతా ఇంకా ఆంధ్ర నేతలకు తొత్తులుగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు గుత్తా. పదవుల కోసం నేటికి కొప్పుల రాజు, కేవీపీల ఇంటి చుట్టూ తిరగడం సిగ్గుచేటన్నారు. జానారెడ్డి గారు…. కోతిమూకల మధ్య ఉండడం కంటే రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని, తానైతే ఆ వయసు వరకు రాజకీయాల్లో ఉండలేనని స్పష్టం చేశారు.