అప్పటి వరకు మెడికల్ కౌన్సిలింగ్ లేనట్టే…!
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్-550పై హైకోర్టు స్టేను తొలగించే వరకు మెడికల్ కౌన్సెలింగ్‌ను నిలిపివేసేందుకు చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. హైకోర్టు స్టేతో మెడికల్ కౌన్సెలింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందని కడియంకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య వివరించారు.
పదిహేడేళ్లుగా స్లైడింగ్ విధానాన్ని ఎత్తివేయడంతో వందలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల సీట్లు అర్హులకు లభించడం లేదు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టేను ఎత్తివేయించేందుకు ప్రభుత్వపరంగా కృషి చేయాలని ఆర్.కృష్ణయ్య కోరారు. ఓపెన్ కాంపిటీషన్లో సంపాదించిన సీట్లను రిజర్వేషన్ కింద లెక్కించొద్దని, ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా మెడికల్ కౌన్సెలింగ్‌ను నిలిపివేసిందని ఆయన తెలిపారు.