పరిపూర్ణానంద అరెస్టు పై చినజీయర్ స్వామి ఎందుకు మాట్లాడ‌రు…!?

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత రావు ప్ర‌భుత్వ వైఖ‌రిపై మండిప‌డ్డారు. తెలంగాణ‌లో ఎవ‌రికీ మాట్లాడే స్వేచ్చ లేద‌ని ఆయ‌న అన్నారు. ప‌రిపూర్ణానంద‌స్వామి దేశ ద్రోహం చేశారా అంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న‌పై గూండా కేసులు పెట్ట‌డ‌మేంట‌ని అన్నారు వీహెచ్. లా అండ్ ఆర్డ‌ర్ పేరు మీద ఎవ‌రిని ప‌డితే వారిని అరెస్టులు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. కేసీఆర్ పాల‌న‌లో మంత్రుల‌కు, శాస‌న‌స‌భ్యుల‌కు విలువ‌లేద‌ని ఆయ‌న అన్నారు.

ప‌రిపూర్ణానంద అరెస్టుపై చిన‌జీయ‌ర్ స్వామి ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. స్వాముల‌కు మాట్లాడేందుకు భయమెందుకని ఆయ‌న అన్నారు. ఈ విష‌యంలో ఎందుకు గ‌వ‌ర్న‌ర్ స్పందించ‌డంలేద‌ని అన్నారు వీహెచ్. టీఆర్ఎస్ భ‌వ‌న్ లో దొర‌ల‌కే స్వేచ్ఛ అని అన్నారాయ‌న‌. కేసీఆర్ లాంటి దుర్మార్గ‌పు ప్ర‌భుత్వాన్ని ఎప్పుడూ చూడ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. అన్ని రాజ‌కీయ పార్టీలు ఛ‌లో ప్ర‌గ‌తి భ‌వ‌న్ నిర్వహించాల‌ని ఆయ‌న అభిప్రాయ‌పడ్డారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి తాను సోమ‌వారం సిటీ కాంగ్రెస్ మీటింగ్ నుంచి మధ్యలో వెళ్లాన‌ని, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు కు సమాచారం ఇచ్చే వెళ్లాన‌ని ఆయ‌న చెప్పారు. పార్టీలో త‌న‌కెలాంటి విభేదాలు లేవని స్ప‌ష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఎవరికి సికింద్రాబాద్ టిక్కెట్ ఇచ్చినా తాను మద్దతిస్తాన‌ని తెలిపారు వీహెచ్.