ఓవర్ టూ ఢిల్లీ…!!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఆగస్టు 10వరకు కొనసాగనున్న పార్లమెంటు సమావేశాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన హామీలపై ఇరు రాష్ట్రాలు పార్లమెంటు వేదికగా తమ గొంతు వినిపించనున్నాయి. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రులను కలిసారు టీఆర్ఎస్ మంత్రులు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విన్నవించారు మంత్రి హరీష్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై పార్లమెంటులో ప్రస్తావించనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.
ఏపీకి సంబంధించి రాష్ట్రంలో హోదా పోరు నడుస్తోంది. అధికార, విపక్ష నేతలు పోటాపోటీ దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటూ ఢీ అంటూ ఢీ అంటున్నాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీజేపీపై అవిశ్వాస తీర్మానం పెట్టేయోచనలో టీడీపీ ఉంది. ఇప్పటికే ఎన్డీఏయేతర పార్టీలను కలిసి మద్దతు కోరారు టీడీపీ ఎంపీలు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని కూడా అవిశ్వాసానికి మద్దతు కోరారు. విపక్షాలను ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్ కూడా అన్ని రకాలుగా సిద్ధమైంది.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో టెలిఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ఎంపీలకు క్లారిటీనిచ్చారు.