ప్ర‌జాస్వామ్యంపై న‌మ్మ‌కం కోల్పోయే ప్ర‌మాదం వ‌చ్చింది..!!

పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో టీడీపీ ఎంపీల‌తో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు టెలీకాన్ఫ‌రెన్స్ లో మాట్లాడారు. ఏపికి జ‌రిగిన‌ అన్యాయం చక్కదిద్దుతామని బిజెపి చెప్పింద‌ని, ఇప్పుడు బిజెపి నేతలే అన్యాయం చేస్తున్నారు.ఇది నమ్మిన వారిని మోసగించడం కాదా..? అని ప్ర‌శ్నించాల‌ని ఎంపీల‌కు చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. ప్రజాకోర్టులో వారిని దోషులుగా నిలబెట్టాల‌ని, ఏ పార్టీలు టీడీపీకి మద్దతు ఇస్తాయో ప్రజలే చూస్తారని చంద్ర‌బాబు అన్నారు. పోరాటం చేయాల్సిన సమయంలో వైసిపి ఎంపిలు గోదా వదిలేశారని, బైటకొచ్చి పోరాడుతున్నట్లు యాక్షన్ చేస్తున్నార‌ని అన్నారు ఏపీ సీఎం.

వైసీపీ పలాయన వాదానికి ఇదే నిదర్శనమ‌న్నారు చంద్ర‌బాబు. వాళ్ల రాజీనామాలను ప్రజలు పట్టించుకోవడం లేద‌ని, వైసిపికి వాయిస్ లేకుండా పోయిదిక్కుతోచని స్థితిలో ప‌డింద‌న్నారు. వాళ్ల విశ్వసనీయత పోయిందని త‌మ విశ్వసనీయత దెబ్బ తీయాలని చూస్తున్నారని చెప్పారు.ప్రత్యర్ధుల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంపీల‌కు సూచించారు.రాజకీయ పార్టీలపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని, ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం వచ్చిందని ఆయ‌న అన్నారు. ఎంపిలు సమన్వయంతో పనిచేస్తూ, వ్యూహాత్మకంగా వ్యవహరించాల‌ని, లాలూచి రాజకీయాలను ఎండగట్టాలని సీఎం సూచించారు.