అందుకే.. వినాయక్’ని బాలయ్య పక్కన పెట్టేశాడు !
‘అఖిల్’ సినిమాతో మాస్ దర్శకుడు వి.వి వినాయక్ పరువు మొత్తం పోయింది. ఈ సినిమాతో వినాయక్ పనైపోయిందనే కామెంట్స్ వినిపించాయి. ఐతే, అప్పటికే చర్చల్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రం ‘ఖైదీ నెం.150’ అవకాశం కొట్టేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ క్రెడిట్ మొత్తం మెగాస్టార్ ఖాతాలోకే వెళ్లింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన స్టార్ హీరోలు ఎవ్వరూ.. వినాయక్ వైపు చూడలేదు. దీంతో మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజుని ‘ఇంటిలిజెంట్’గా చూపించాడు వినాయక్. టైటిల్ లో మాత్రమే ‘ఇంటిలిజెంట్’ ఉంది. సినిమాలో అదెక్కడ కనిపించలేదు. ఫలితంగా దర్శకుడు వినాయక్, హీరో తేజు ఖాతాలో మరో ప్లాపు పడినట్లయ్యింది.
‘ఇంటిలిజెంట్’ సినిమా చూశాక వినాయక్ తో పని చేయడానికి స్టార్ హీరోలెవరైనా ముందుకు రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ, బాలకృష్ణ లాంటి పెద్ద హీరో అతడికి అవకాశమిచ్చాడు. కథ రెడీ చేసుకుంటే వెంటనే సినిమా చేయడానికి సిద్ధమని చెప్పాడు. నాలుగు నెలల కిందటే వినాయక్ కు ఈ ఆఫర్ వచ్చింది. ఐతే, వినాయక్ రొటీన్ కథతో బాలయ్య ముందుకు వెళ్లాడు. అది ఆయన్ని సంతృప్తి పరచలేకపోయింది. ఈలోపు ఆలస్యమవుతుందనుకొన్న ‘యన్.టి.ఆర్’ ముందుకు కదిలింది. బాలయ్య బిజీ అయిపోయాడు.
ఈ సినిమా పూర్తయిన తర్వాత అయినా బాలయ్య దొరుకుతాడేమో.. అన్న వినాయక్ ఆశలపై బోయపాటి నీళ్లు చల్లారు. వీరిద్దరి కలయికలో ఓ సినిమా ఓకే అయ్యింది. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అక్టోబరు 10న ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుగుతుందట. వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేస్తారని సమాచారమ్. ప్రస్తుతం బోయపాటి రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది.