చంద్రబాబుతో రోజుకొకరు.. !

తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఇన్నాళ్లు సలైంట్ గా ఉన్న కొందరు రాజకీయ నేతలు నిద్రలేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, సీఎం చంద్రబాబుతో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ భేటీ అయ్యారు. వీరి మధ్య దాదాపు 10 నిమిషాలు చర్చ జరిగింది.

భేటీ అనంతరం శైలాజనాథ్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై చంద్రబాబుతో చర్చించాను. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం హైదరాబాదులో ఉన్న ఆసుపత్రుల్లో అమలుకావడం లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లా’నని చెప్పారు. మరోవైపు, ఈ భేటీ వెనక రాజకీయ ప్రయోజనం ఉందనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే శైలజా రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని చెప్పుకొంటున్నారు.

సోమవారం రాత్రి మాజీ ఎంపీ ఉండవల్లి సీఎం చంద్రబాబుని కలిశారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చంద్రబాబుకు కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. ఆ సూచనలని టీడీపీ తూ. చ తప్పకుండా పాటించినట్టయితే.. ఉండవల్లి కూడా టీడీపీలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చెప్పుకొంటున్నారు.

ఇక, అనకాపల్లి మాజీ ఎంపీ, విశాఖ‌ప‌ట్నం మాజీ మేయ‌ర్ స‌బ్బం హ‌రి త్వ‌ర‌లో సీఎం చంద్రబాబుని కలవబోతున్నాడు. ఆయన కూడా టీడీపీలో చేరేందుకు రెడీగా ఉన్నాడని స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి.. చంద్రబాబుతో రోజుకో ముఖ్యనేత వచ్చి కలవడం ప్రాధాన్యత సంతరించుకొంటోంది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుందనే వాదన కూడా ఉంది. ఏదేమైనా.. ఈ భేటీలు టీడీపీకి ప్రయోజనం చేకూర్చేటట్టుగానే కనబడుతున్నాయి.