అది నిజ‌మ‌ని నిరూపిస్తే 24కోట్లు ఇస్తాం..!!

ఉప్పల్ స్టేడియంకు స్పాన్సర్ షిప్ వ్యవహారంపై విశాఖ ఇండ‌స్ట్రీస్ స్పందించింది. గ‌త కొంత‌కాలంగా విశాఖ ఇండస్ట్రీస్ పై వీహెచ్, శేషనారాయణ చేస్తున్న ఆరోపణల్లొ నిజం లేదని కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేషన్ విశాఖ కు 12 కోట్లు ఇచ్చినట్లు ఆధారాలు చూపిస్తే రెండు రెట్లు అంటే 24 కోట్లు తిరిగి ఇచ్చేస్తామ‌ని వారు స‌వాల్ విసిరారు. అబద్ధాలు చెప్తూ మీడియాను, ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని వార‌న్నారు. శివలాల్ యాదవ్, యాదగిరి, ఎంవీ శ్రీధర్ లు వచ్చి స్పాన్సర్ చేయమని రిక్వెస్ట్ చేస్తేనే తాము 4.32కోట్లు లోన్ తీసుకుని స్పాన్సర్ చేసామ‌ని వారు తెలిపారు.

ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి ఎవరు ముందుకు రాని టైమ్ లో విశాఖ ముందుకొచ్చిందని, అగ్రిమెంట్ ప్రకారమే స్టేడియంకు విశాఖ ఇండస్ట్రీ పేరు పెడతామని వారు తెలిపారు. 2011 లో కావాలనే అగ్రిమెంట్ ను అన్యాయంగా ఆర్షద్ ఆయూబ్ రద్దు చేశారని, ఆర్బిట్రేషన్ కి వెళ్తే విశాఖ కు 25.92 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని హెచ్.సి. ఏ. కి ఆర్డర్ ఇచ్చిందని వారు తెలిపారు. కోర్ట్ బయట సెటిల్ చేసుకుందామని హెచ్.సీ.ఏ ప్ర‌పోజ్ చేస్తేనే విశాఖ అంగీకరించిందన్నారు. అప్పట్లో బీసీసీఐ నుంచి ఫండ్స్ రాగానే 17.5 కోట్లు చెల్లిస్తామని, ఇటీవల నిర్వహించిన జి. వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ లీగ్ కు బీసీసీఐ గుర్తింపు లేదని తప్పుడు ప్రచారాలు చేశారని వారు చెప్పారు.

ఈ టోర్నమెంట్ కోసం విశాఖ 70 లక్షలు స్పాన్సర్ చేసింద‌ని, అందుకే వెంకటస్వామి పేరు పెట్టార‌ని కంపెనీ ప్ర‌తినిధులు చెప్పారు. త‌ప్పుడు ప్రచారాలతో విశాఖ పరువు తీయాలని చూస్తున్నార‌ని, 14 ఏళ్ల తర్వాత అగ్రిమెంట్ తప్పు అనడమేంటని వారు ప్ర‌శ్నించారు. దమ్ముంటే తప్పును కోర్ట్ లో నిరూపించాల‌ని స‌వాల్ చేశారు.