భువనగిరి పార్లమెంటుకు పార్టీల అభ్యర్థులెవరు…?
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. క్షేత్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. 2014లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి బలమైన నేతలు, ప్రజల్లో పేరున్న నేతలనే గెలుపు వరిస్తుందనేది అంతటా వినిపిస్తున్నమాట. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న భువనగిరి పార్లమెంటు స్థానంలో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతోంది. అలాంటి భువనగిరి పార్లమెంటు స్థానంలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆ పార్టీ తహతహలాడుతోంది. అధికార టీఆర్ఎస్ కూడా పట్టుకోల్పోకుండా ఉండేందుకు పావులు కదుపుతోంది.
సిట్టింగులకే సీట్లిస్తామంటూ పలుమార్లు సమావేశాల్లో సీఎం కేసీఆర్ చెప్పినా ఎప్పటికప్పుడు నేతలపై సర్వే చేయించుకుంటూ పరిస్థితులను అంచాన వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న బూర నర్సయ్య గౌడ్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారా, లేక మరో బలమైన నేతెవరినైనా రంగంలోకి దింపుతారా అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఎంపీ కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానంకంటే ఇబ్రహీం పట్నం అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఆయన గురిపెట్టారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఒక క్లారిటీ మాత్రం లేదు.
కాంగ్రెస్ విషయానికి వస్తే చాలామందే కనిపిస్తున్నప్పటికీ అసలు ఇప్పటివరకు ఓ భరోసా కలిగిన నేతగానీ, రంగంలోకి దిగే నాయకుడు కానీ లేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎంపీగా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీకాలం ఇంకా మూడేళ్లకు పైగానే ఉంది. దీనికితోడు ఆయన మునుగోడు అసెంబ్లీ నియోజవర్గంపై గురి పెట్టడం కూడా ఎంపీగా ఆయన పోటీ చేస్తారా లేదా అనే అనుమానాలకు తావిస్తోంది. దామోదర్ రెడ్డి కుమారుడు పోటీచేస్తారని, మరో వైపు పొన్నాల కూడా భువనగిరి టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారమూ ఉంది.
ఇంకోవైపు టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి కూడా పోటీలో తానూ ఉంటానంటూ, అధిష్టానం టికెట్ ఇస్తుందనే నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తామంటున్నారు. మొత్తంగా కాంగ్రెస్ లో కూడా ఇప్పటి వరకు ఎంపీ అభ్యర్థికి ఫలానా నేత పోటీ చేస్తారనే క్లారిటీ లేదు. దీనికితోడు గెలుపుగుర్రాలకే టిక్కెట్లంటూ కాంగ్రెస్ లో లీకులిస్తుండటం, భువనగిరి పార్లమెంటు స్థానానికి అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీలో కూడా క్లారిటీ లేకుండా పోయింది.
ఇక తెలంగాణలో పాగా వేస్తామంటూ చెప్పుకుంటున్న బీజేపీ కూడా భువనగిరి నుంచే బీజేపీ విజయఢంకా మోగిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఆ పార్టీలో కొందరు సీనియర్ నేతలు భువనగిరి ఎంపీ స్థానంపై ఆసక్తి ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో తమ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం మాత్రం ఎవరూ చేయడంలేదు. మొత్తంగా భువనగిరి పార్లమెంటు స్థానానికి అన్ని పార్టీల్లో అభ్యర్థులు ఎవరనేది క్లారిటీ లేదు. ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేకపోవడంతో అసలు భువనగిరి ఖిలాపై ఏ పార్టీ జెండా ఎగురుతుందనే ఉత్కంఠ నెలకొంది.