అప్పుడలా…! ఇప్పుడిలా..!! టీఆర్ఎస్ ఓటెవరికి…?
పార్లమెంటులో టీడీపీ అవిశ్వాస తీర్మాణం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎన్డీఏయేతర పార్టీల మద్దతు కోరుతూ అన్ని పార్టీలను కలిసారు టీడీపీ ఎంపీలు. అందులో భాగంగా తెలంగానలో టీఆర్ఎస్ మద్దతు కూడా కోరారు. అయితే ముందుగా టీడీపీకి మద్దతు తెలపాలనుకున్న టీఆర్ఎస్ ప్రస్తుతం ఆ ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టంలో ఉన్నవాటికే మద్దతు ఇస్తామంటూ ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మాత్రం సమర్థించేది లేదని టీఆర్ఎస్ బాహటంగానే చెబుతోంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమ పరిశ్రమలు ఏపీ వెళతాయంటూ మెళిక పెడుతోంది టీఆర్ఎస్. లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అవిశ్వాసంపై టీఆర్ఎస్ ఎటువైపు అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. గతంలో సీఎం కెసీఆర్ ప్రత్యేక హోదా ఇస్తారో..ఇవ్వరో తేల్చేయాలంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఎంపీ కవిత కూడా పలుమార్లు ఏపీకి ప్రత్యేక హోదాకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు కూడా. కానీ ప్రస్తుతం కేంద్రంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉంటున్నారు.
కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి వచ్చే నిధులు ఆగిపోతాయంటూ టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం కూడా ఆ పార్టీ బీజేపీకి అనుకూలమనే అనుమానాలకు తావిస్తోంది. మోడీతో కలిసి ముందుకు సాగుతుందనే సంకేతాలు పంపుతున్నట్లుగా ఉంది. ఏపికి ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ వ్యతిరేకించడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీఆర్ఎస్ నిర్ణయం ఆ పార్టీకి ఎంతమేరకు లాభం చేకూరుస్తుందనేది చూడాలి మరి.