బీజేపీని సపోర్టు చేస్తున్న టీడీపీ ఎంపీ

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్ సభలో చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఎన్డీయే యేతర పార్టీల మద్దతుని కూడగట్టడంతో టీడీపీ ఎంపీలు బిజీగా ఉన్నారు. అదే సమయంలో విభజన హామీలపై బీజేపీ ఎలా మోసం చేసింది ? అన్న సమగ్ర సమాచారాన్ని ఇతర పార్టీ నేతలకు అందిస్తోంది. దాదాపు 150 సభ్యులు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వనున్నారు. ఐతే, ఓ టీడీపీ ఎంపీ మాత్రం సొంత పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఎంపీ ఎవరో కాదు.. జేసీ దివాకార్ రెడ్డి. నిర్మోహమాటంగా మాట్లాడే జేసీ.. అవిశ్వాసం విషయంలో మోహమాటం లేకుండా టీడీపీకి సపోర్టు చేయడం లేదని ప్రకటించేశారు.

తన నిర్ణయంపై పార్టీ ఏ నిర్ణయం తీసుకొన్నా.. భయపడేది లేదు. పార్టీ నుంచి బహిష్కరించినా నో ఫికర్ అంటున్నారు. మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం ఏపీకి ఏమీ రాదనే విషయాన్ని తాను గత నాలుగేళ్లుగా చెబుతూనే ఉన్నా. ఇప్పుడు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో కూడా సాధించేదేమీ లేదని జేసీ అన్నారు. అవిశ్వాసంపై చర్చ రోజున అసలు తాను సభకు వెళ్లడం లేదు. తాను పార్లమెంటుకు వెళ్లినంత మాత్రాన ఒరిగేదేమీ లేదున్నారు.

టీడీపీ అధిష్టానంపై జేసీ అలకబూనారు. అందుకే.. సొంత పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి ఆయన సపోర్ట్ చేయడం లేదని అంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా టీడీపీలోకి చేరాలని ప్రయత్నిస్తున్నారు. పార్టీ నాయకత్వం కూడా ఆయన పట్ల సానుకూలంగానే ఉందని తెలుస్తోంది. ఐతే, ఆయన చేరికను జేసీ వ్యతిరేకిస్తున్నారు. దాని రియాక్షన్ నే అవిశ్వాసంపై జేసీ తోకాడించడమని చెప్పుకొంటున్నారు.

మరోవైపు, జేసీ పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన వచ్చే సాధారణ ఎన్నికల్లోగా వైసీపీ లో చేరవచ్చని చెబుతున్నారు. అదీ సాధ్యం కాకుంటే పవన్ లేదా. మళ్లీ కాంగ్రెస్ గూటికే వెళ్తారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అసలు జేసీ పోటీ చేయడం లేదు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగనున్నారు. మొత్తానికి.. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణానికి సొంత పార్టీ ఎంపీ సపోర్టు లేకపోవడం.. జాతీయస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.