భాజపా, కాంగ్రెస్‌, తెదేపాలకు.. తెరాస దూరం !

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై నేడు లోక్ సభలో చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై తెరాస తటస్థ వైఖరిని అవలంభించబోతుంది. భాజపా, కాంగ్రెస్‌, తెదేపా పార్టీలకు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది. అదే సమయంలో రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల అంశంపై కేంద్రాన్ని నిలదీయనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.

భాజపా, కాంగ్రెస్‌, తెదేపా పార్టీలు తెలంగాణకు ఏనాడు అనుకూలంగా వ్యవహరించలేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. తెలంగాణ ప్రయోజనాల గురించి, విభజన హామీల అమలు గురించి కాంగ్రెస్‌ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఏపీకి మద్దతు ఇస్తూ తెలంగాణపై వివక్ష చూపుతోంది. ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఇక్కడి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేస్తున్నారు. ఇది తెలిసినా ఆ పార్టీ అధిష్ఠానం పట్టించుకోవడంలేదు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మేలు చేయలేదు. హైకోర్టు విభజన జరగలేదు. కేంద్రం తలుచుకుంటే నెలరోజుల్లోనే దీనిని పూర్తి చేయవచ్చు. దీనికి చొరవ చూపలేదు. బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, 400 మెగావాట్ల మెగా విద్యుత్కేంద్రం నిర్మాణం, తొమ్మిదో, పదో షెడ్యూల్డు సంస్థల విభజన ఇలా అన్నింటా మొండిచేయి చూపింది.

విభజనతో లబ్ధి పొందిన తెదేపా.. విభజన సరికాదు అంటూ విమర్శిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేందుకు యత్నిస్తోంది. కాళేశ్వరానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.. ఆ పార్టీ మనుగడ కోసం అవిశ్వాసానికి తెరతీసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం. పారిశ్రామికంగా నష్టదాయకం. పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉంది. ఏపీకి ఎన్నోవిధాలుగా, ఎన్నోరకాలుగా సాయం అందించినా, నిధులిచ్చినా మేం అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీసేలా ఏపీకి మేలు చేయాలనే ప్రయత్నాలను మాత్రం అడ్డుకోవాలి. వీటన్నింటిపై చర్చలో ప్రస్తావించాలని టీఆర్ ఎస్ నిర్ణయించింది.