సభలో ప్రధానికి షాక్ ఇచ్చిన రాహుల్


కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని ఆశ్చర్యానికి గురి చేశాడు. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన రాహుల్‌ ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందం, పెద్ద నోట్ల రద్దుపై విమర్శలు చేశారు. మహిళలకు రక్షణ లేదంటూ ధ్వజమెత్తారు. ప్రజల నెత్తిన జీఎస్టీ రుద్దారని విమర్శించారు. చివరలో నన్ను పప్పు అన్నా ఫర్వాలేదు, తిట్టినా నేను ద్వేషం పెంచుకోనని అన్నారు. ఆ వెంటనే తన స్థానం నుంచి నేరుగా మోడీ వద్దకు వెళ్లి కుర్చీలో కూర్చున్న ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇది మోడీని షాక్ కు గురిచేసింది. ఆ వెంటనే తిరిగి వెళ్తున్న రాహుల్ ని పిలిచి కరచాలనం చేసి.. అభినందించారు. తిరిగి తన స్థానంలో కూర్చొన్న రాహుల్ పక్కకు చూస్తూ ఝులక్ ఇచ్చినట్టు కన్నుకొట్టారు. రాహుల్ చేసిన ఈ చిలిపి పని సభలో హైలైట్ అయ్యింది. పార్లమెంట్ చరిత్రలో చోటు చేసుకొన్న ఓ ఆసక్తికరమైన సంఘటనగా దీన్ని అభివర్ణిస్తున్నారు.