భాజాపా, టీడీపీ.. గొప్ప అవకాశాన్ని వృథా చేశాయి : పవన్

వచ్చే ఎన్నికల్లో ఏపీలో మూడు పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేనలు ప్రభావాన్ని చూపేలా కనిపిస్తున్నాయి. ఐతే, వీటిలో జనసేన పార్టీకి నేడు లోక్ సభలో జరుగుతున్న అవిశ్వాస చర్చలో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఆ పార్టీ ప్రజా ప్రతినిధులెవ్వరు లేరు. అసలు ఇప్పటి వరకు జనసేన ఎన్నికల బరిలో దిగలేదు. గత ఎన్నికల్లో భాజాపా-టీడీపీ కూటమికి భుజం కాసింది. పవన్ మానియాతోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని టీడీపీ నేతలే చెప్పుకొంటుంటారు. ఈ విషయం ప్రక్కన పెడితే.. తాజా అవిశ్వాస చర్చలో పాల్గొనాలే ఆతృత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో కనబడింది.

లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ మొదలవ్వక ముందే పవన్ ట్విట్టర్ లో స్పందించారు. ‘ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నా. ఏపీ ప్రజల హక్కులు సాధించుకునేందుకు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంట్‌ సరైన వేదిక. మాకు న్యాయం చేయండి. తెదేపాపై ఉన్న కోపాన్ని.. ప్రత్యేక హోదా నిరాకరించడానికి కారణంగా చూపించకండి’ అంటూ ట్విట్ చేశారు. ఇక, కొద్దిసేపటి క్రితమే పవన్ మరో ట్విట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని భాజపా, తెదేపాలు వృథా చేశాయి. ప్రజల విలువైన సమయం, డబ్బు, వేదనతో ఇలా రాజకీయ నాటకాలకు తెరతీయకుండా వారు ప్రజలకు అండగా ఉండాల్సింది’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు. బహుశా.. అవిశ్వాస తీర్మాణంపై లోక్ సభలో పవన్ ప్రసంగించే అవకాశం ఉంటే.. ఆయన వాడివేడి ప్రసంగాన్ని చూసేవాళ్లమని ఆయన అభిమానులు అనుకొంటున్నారు.