రాహుల్ తప్పు చేశారా…?
పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ ప్రసంగం ముగించే సమయానికి మోదీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనకు ప్రధాని మోదీతో పాటు సభలో సభ్యులంతా అవాక్కయ్యారు కూడా. అయితే ఆ తరువాత మోదీ నవ్వుతూ రాహుల్‌ను పలకరించి.. భుజం తట్టారు. ఆ తరువాత సీట్లోకి వెళ్లి కూర్చున్న రాహుల్ కన్నుకొట్టారు. అయితే సభలో హుందాగా వ్యవహరించాల్సిన రాహుల్ ఇలా చేయడంపై రాజకీయ వర్గాల్లో ఒకింత చర్చకు దారితీసింది. అసలు రాహుల్ ప్లాన్ ప్రకారమే అధికార పక్షాన్ని కన్ప్యూజన్ లో పడేయడానికి అలా చేశారా, లేక ఇంకేదైనా ఆలోచనలో చేశారోగానీ పార్లమెంటులో ఈ సీన్ ఓ ఎస్సెట్ గా మారింది.
సభా సంప్రదాయాల ప్రకారం రాహుల్ ఇలా చేయడం తగదని స్పీకర్ సుమిత్రా మహాజన్ మందలించారు. సభ హుందాతనాన్ని కాపాడాలంటూ రాహుల్ కు సూచించారు. ప్రధాని నరేంద్రమోదీని రాహుల్ ఆలింగనం చేసుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. తన స్థానంలోకి వెళ్లిన రాహుల్ కన్నుకొట్టడం సరైంది కాదని అన్నారు స్పీకర్. ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడంపై తనకు అబ్యంతరం లేదని, కానీ సభలో ఇలా ప్రవర్తించడం సరికాదని ఆమె అన్నారు. రాహుల్ జీవితంలో ఎదగాల్సిన నేతల అని, సభలో లేని సంప్రదాయాలను తీసుకురావడం సరికాదని చెప్పారు. ఏదేమైనా రాహుల్ చర్యలతో సభలో సీరియస్ నెస్ అంతా పోయి టాపిక్ కాస్తా డైవర్ట్ అయిందని చెప్పుకోవచ్చు.