టీడీపీని ఇర‌కాటంలో ప‌డేసిన రాజ్‌నాథ్ !!

అవిశ్వాసం చ‌ర్చ‌లో భాగంగా టీడీపీకి స‌మాధాన‌మిచ్చిన కేంద్ర‌మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒకే ఒక్క మాట‌తో ఆ పార్టీని ఇర‌కాటంలో ప‌డేశారు. అవిశ్వాసంతో కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డంతో పాటు, ఏపీలో రాజ‌కీయంగా మైలేజ్ వ‌స్తుంద‌నుకున్న టీడీపికి ఆయ‌న షాక్ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌మ‌కు ఎప్ప‌టికీ మిత్రుడే అంటూ వ్యాఖ్యానించ‌డం వెన‌క ఆయ‌న వ్యూహాత్మ‌కంగానే ఈ వ్యాఖ్య‌లు చేశారనే వాద‌న వినిపిస్తోంది.

ఎన్డీయే నుంచి బయటకొచ్చినా చంద్రబాబు ఎప్పటికీ తమకు మిత్రుడే అన్నారు రాజ్ నాథ్ సింగ్. 14వ ఫైనాన్స్ కమిషన్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని ఆయ‌న తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఏపీ రెవెన్యూలోటు భర్తీ చేస్తామని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.1500 కోట్లు ఇచ్చామని, విభజన చట్టంలో హామీలు దాదాపుగా అమలు చేశామని చెప్పుకొచ్చారు. మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామన్నారు.

ఒక‌వైపు టీడీపీ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూనే రాజ‌కీయంగా టీడీపీకి ల‌బ్ధి చేకూర‌కుండా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు రాజ్ నాథ్. టీడీపీని ఇర‌కాటంలో పడేసేలా రాజ్ నాథ్ వ్యాఖ్యానించ‌డం ఆ పార్టీ నేత‌ల‌నూ డైలామాలో ప‌డేసింది. మ‌రి ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు టీడీపీ ఎలా కౌంట‌ర్ ఇస్తుందో చూడాలి.