మిత్రుడని చెప్పుకోవడం కాదు.. ఏం చేశారో చెబితే బాగుండేది..!!
పార్లమెంటులో కేంద్రమంత్రి రాజ్ నాథ్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర ఎంపీలకు టెలిఫోన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. తదుపరి సభో వ్యవహరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారు. మంచి మిత్రుడు అని చెప్పుకోవడం కాదు, రాష్ట్రానికి ఈ నాలుగేళ్లూ ఏంచేశారో రాజ్‌నాథ్ చెప్పివుంటే బావుండేదని ఎంపీలతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు సీఎం.
బీజేపీ నేతలు పాత పాటే పాడుతున్నారు తప్ప, చేసిందేంటో స్పష్టంగా చెప్పడం లేదని ఆయన అన్నారు. వారు వాస్తవాలు చెప్పేవరకు వదలొద్దని, గట్టిగా నిలదీయాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి ఏంచేశారో వారు నిజాయితీగా పున:సమీక్ష చేసినట్టు ఎక్కడా కనిపించడం లేదన్నారు. వారి మాటల్లో నిజాయితీ లేదని, రాష్ట్రానికి ఏం చేశారో కచ్చితమైన లెక్కలు చెప్పేవరకు వదిలిపెట్టే ప్రశ్నేలేదన్నారు. రాజ్‌నాథ్ మాట్లాడినట్టే ప్రధానమంత్రి మోడీ కూడా పాత పాటే పాడే అవకాశం ఉందని, సభలో గట్టిగా నిలదీయాలని అన్నారు చంద్రబాబు.