ఈ వారం తేజస్వీ అవుట్.. ముందే లీకు !

‘ఈ సారి కాస్త మసాలా’ అంటూ తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 మొదలెట్టారు. ‘ఏదైనా జరగొచ్చు’ అని షోపై ఆసక్తిని పెంచేశారు. ఆ రేంజ్ లో సీజన్ 2 కొనసాగడం లేదు. దీనికితోడు.. లీకులు షోపై ఆసక్తి తగ్గిపోయేలా చేస్తున్నాయి. ఆదివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు ? అన్నది శనివారమే తెలిపోతుంది. గత వారం యాంకర్ శ్యామల విషయంలో ఇదే జరిగింది. ఈ వారం కూడా ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది అప్పుడే తెలిసిపోయింది. ఈ వారం తేజస్వీ మదివాడ ఎలిమినేట్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్నేహితురాలు ఒకరు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘తేజస్వి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆమెను కలిశా’ను అంటూ ఆమె ఫ్రెండ్ ఒకరు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియా వైరల్ గా మారింది.

సోమవారం నుంచి శుక్రవారం వరకు బిగ్ బాస్ ఇంటి సభ్యులు వివిధ టాస్క్ ల ద్వారా ప్రేక్షకులకి వినోదం పంచుతారు. శనివారం నాని ఎంట్రీ ఇచ్చి.. ఆ వారం ఎలినేట్ అయ్యేది ఎవరనే విషయంపై ఉత్కంఠకు గురిచేశారు. ఇంటి సభ్యులని, ప్రేక్షకులని టెన్షన్ పెట్టి.. ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. నిజానికి ఆ ఉత్కంఠనే బిగ్ బాస్ ప్రధాన బలం. ఇప్పుడా బలం లీకుల కారణంగా బలహీనంగా మారుతోంది. ఇదీగాక, బిగ్ బాస్ షోకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలు లీకయ్యాయి. కెమెరా ఆపరేటర్లు, రోజువారిగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వస్తున్న ఓట్ల వివరాలు అందులో ఉన్నాయి. బిగ్ బాస్ షోలో లీకుల పర్వం ఇలానే కొనసాగితే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పుకొంటున్నారు.