సత్య నాదేండ్ల స్పూర్తితో మహేష్.. !

సూపర్ స్టార్ మహేష్ బాబు మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదేండ్లని స్ఫూర్తిగా తీసుకొన్నారని తెలిసింది. వంశీపైడి పల్లి దర్శకత్వంలో మహేష్ 25వ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ని డెహ్రాడూన్ లో పూర్తి చేసుకొంది. త్వరలో రెండో షెడ్యూల్ కోసం గోవా వెళ్లనుంది. ఆ తర్వాతి షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్లనుంది చిత్రబృందం. ఈ సినిమా విభిన్న కథాంశంతో తెరకెక్కుతోందని చెబుతున్నారు. ఇందులో మహేష్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారట. కాలేజ్ స్టూడెంట్ గా, ఓ అమెరికన్ కంపెనీ సీఈవో, రైతుగా మహేష్ కనిపించబోతున్నట్టు సమాచారమ్. అంతేకాదు.. మహేష్ పాత్రని తెలుగువాడు, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేండ్లని స్పూర్తి తీసుకొని డిజైన్ చేసినట్టు చెబుతున్నారు.

కాలేజ్ స్టూడింట్ గా, అమెరికన్ కంపెనీ సీఈవో చూపించడం వరకు ఓకే. మరీ.. మహేష్ రైతుగా ఎలా మారాడు ? అన్నది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ సినిమా ట్రీట్ మెంట్ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ స్టయిల్ లో ఉంటుందని చెబుతున్నారు. చాన్నాళ్ల నుంచి ఈ సినిమా కోసం మహేష్ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇదంతా చూస్తుంటే.. మహేష్ 25 కథ-కథనాలు అద్భుతంగా ఉంటాయని చెబుతున్నారు. బహుశా.. మహేష్ తెరపై సత్యనాదేండ్లగా కనిపిస్తారేమో.. ! ఇదే నిజమైతే.. ఇది సత్య నాదేండ్ల బయోపిక్ అని పిలవొచ్చు.

ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. కామెడీ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన మహేష్ రూంమేట్ గా కనిపిస్తారని చెబుతున్నారు. డెహ్రాడూన్ షెడ్యూలో మహేష్ తో పాటు నరేష్, పూజా హెగ్డే పాల్గొన్నారు. మహేష్ గెడ్డం లుక్ లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.