బన్నీ.. త్రివిక్రమ్ కోసం ఎదురుచూస్తున్నాడా.. ?
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమా ఏంటన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ మరో సినిమాని మొదలెట్టలేదు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ కు బన్నీ ఓకే చెప్పాడు. విక్రమ్ కథ కూడా రెడీ చేశాడు. పూర్తి కథని బన్నీకి వినిపించాడు. ఐతే, సెకాంఢాఫ్ లో కొన్ని మార్పులు చేయమని బన్నీ సూచించినట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడా మార్పులు చేయడం కూడా అయిపోయాయి. ఆ మార్పులు బన్నీని సంతృప్తిపరచలేదట. దీంతో విక్రమ్ సినిమాని బన్నీ పక్కన పెట్టేశాడనే ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు.. బన్నీ త్రివిక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నాడట. మరో దర్శకుడితో సినిమా చేసేందుకు పెద్దగా ఆసక్తిని చూపడం లేదని సమాచారమ్. ఇప్పటికే త్రివిక్రమ్ – బన్నీ కలయికలో జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలొచ్చాయ్. వీరి కలయికలో హ్యాట్రిక్ సినిమా రాబోతుందని చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ తారక్ ‘అరవింద సమేత’తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ అయిపోవచ్చింది. ఈ దసరాకి సినిమాని ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే త్రివిక్రమ్ దొరుకుతాడని బన్నీ భావిస్తున్నాడట.
ఓ సినిమా పూర్తయిన తర్వాతే.. మరో సినిమా ఓకే చేస్తాడు త్రివిక్రమ్. ఇప్పటి వరకు తన తదుపరి సినిమా కోసం ఏ హీరోతోనూ కమిట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే బన్నీ త్రివిక్రమ్ కోసం వెయిట్ చేయడానికి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ కూడా బన్నీకి ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి బాగానే ఆడాయి. కాకపోతే.. అది త్రివిక్రమ్ రేంజ్ హిట్ కాదనే చెబుతున్నారు. అందుకే ఈ సారి బన్నీతో కలిసి గట్టిగా కొడతాడట త్రివిక్రమ్.